భాగ్యనగరమా.. ఊపిరి పీల్చుకో!

సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ఆ ఇద్దరికీ నెగిటివ్‌ అని నిర్ధారణ అయింది. భాగ్యనగరం కరోనా టెన్షన్‌ నుంచి కొంత ఉపశమనం పొందింది. పుణె వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో వీరికి కరోనా లేదని తేల్చడంతో వైద్య ఆరోగ్యశాఖతో పాటు బాధితులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న బంధువులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిని మరో రెండు మూడు రోజుల పాటు ఇదే ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి,ఆ తర్వాత హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించనున్నారు. దుబాయి నుంచి వచ్చినపాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితుడి తల్లిదండ్రులు, ఇతర బంధువులు, చికిత్స చేసిన వైద్య సిబ్బందికీ ఇప్పటికే నెగిటివ్‌ అని తేలింది. పాజిటివ్‌ బాధితుడు కూడా కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించడంతో నగరవాసులు ఇప్పుడిప్పుడే ఆందోళన నుంచి తేరుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఒకవైపు  కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో కరోనా వైరస్‌ ప్రివెంటివ్‌ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా ఆస్పత్రికి చేరుకుని మందులను పంపిణీ చేశారు. 


అనుమానితుల తాకిడి..
విదేశాల నుంచి వచ్చిన తర్వాత చాలా మందిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. తమకు కరోనా వైరస్‌ సోకిందేమోననే అనుమానంతో వైద్య పరీక్షల కోసం వారు గాంధీ నోడల్‌ కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారికి క్లోజ్‌ కాంటాక్ట్‌ ఉన్న 34 మంది అనుమానితులు బుధ, గురువారాల్లో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వైద్యులు వారిని వెంటనే ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని డిశ్చార్జి చేసి, హోమ్‌ ఐసోలేషన్‌కు సిఫార్సు చేసే అవకాశం ఉంది. 


కేరళకు గాంధీ వైద్య బృందం..
ప్రస్తుతం గాంధీలో ఒక పాజిటివ్‌ కేసు నిర్ధారణ కావడం, విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండటం, రోజుకు సగటున 20 నుంచి 25 మంది అనుమానితులు వస్తుండటం, భవిష్యత్తులో పాజిటివ్‌ కేసులు మరిన్ని నమోదయ్యే అవకాశం ఉంది. ఈ చికిత్సలపై గాంధీ వైద్యులకు సరైన అనుభవం లేకపోవడంతో వైద్యులకు ఈ అంశంలో శిక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గాంధీ సహా ఇతర ఆస్పత్రులకు చెందిన ఆరుగురు వైద్యులతో కూడిన బృందాన్ని కేరళకు పంపింది. ఇప్పటికే అక్కడ మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, వైరస్‌ గుర్తింపు మొదలు, చికిత్సల్లో అనుసరించిన మెలకువలను అధ్యయనం చేయనున్నారు. బాధితులను వైరస్‌ భారీ నుంచి రక్షించిన అనుభవం అక్కడి వైద్యులకు ఉండటం, కరోనా చికిత్సల్లో వారు అనుసరించిన విధానాలను పూర్తిగా అధ్యయనం చేసేందుకు వీరు అక్కడికి వెళ్లారు.


ఐసోలేషన్‌ వార్డును తరలించండి
స్వైన్‌ఫ్లూ, ఎబోలా, కరోనా ఇలా ఏ వైరస్‌ వ్యాపించినా గాంధీకే పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్వైన్‌ఫ్లూ నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు ఒకటి రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుంటాయి. తాజాగా కరోనా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వైరస్‌ బాధితులు సాధారణ రోగుల మధ్య కలిసి తిరుగుతుండటంతో ఎవరికి ఏ జబ్బు ఉందో గుర్తించడం కష్టంగా మారుతోంది. వైద్యులతో పాటు నర్సులు రోగులకు అత్యంత సమీపంలో ఉంటారు. స్వైన్‌ప్లూ, కరోనా వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటం, ఆస్పత్రిలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నివాసాల మధ్య కరోనా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయడం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తుండగా,  ఇదే అంశాన్ని జూనియర్‌ డాక్టర్ల సంఘం లేవనెత్తింది. ఐసోలేషన్‌ వార్డును ఆస్పత్రినుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటూగురువారం ఆందోళనకు దిగడం కొసమెరుపు.